Creative works from Telusuna Members

వచ్చితి స్వామి వాకిలి వద్దకు

రమాకాంతరావు చాకలకొండ

పల్లవి. వచ్చితి స్వామి వాకిలి వద్దకు,
యిచ్ఛలు తీరెను యిక నను గొనుము. ||వచ్చితి||

అనుపల్లవి. తుచ్ఛపు జన్మపై తీరెను మోహము
మెచ్చిక యిమ్ము నీ మృదు పదము. ||వచ్చితి||

1. పచ్చగ నన్ను బ్రతుకగ జేసి
యిచ్చితివెన్నో యిహ సంపదలు,
ఎచ్చట ఎన్నడూ లోపము చేయక,
మెచ్చి యిచ్చితివి మహ భాగ్యములు. ||వచ్చితి||

2. మచ్చలు తుడిచి మనిషిని చేసి,
అచ్చపు సుఖములు అందించితివి,
విచ్చుక జేసి, వాణిని గూర్చి
నచ్చితివి నా - పద పుష్షములు. ||వచ్చితి||

3. ముచ్చటగ నీ ముంగిట జేర్చి,
రచ్చల బ్రతుకులు రహితము జేయుము,
అచ్చెరు వొందగ అందరు - నన్ను
అచ్యుత! నీలో ఐక్యము జేయుము. ||వచ్చితి||

యీ నెల (డిశంబరు) 4న తిరుమలలో స్వామి గర్భగుడిలో ప్రవేశించునపుడు మదిలో స్ఫురించిన పాట. – చాకలకొండ రమాకాంతరావు.


#maa telugu talliki mallepU daMDaa#

Back to list