Creative works from Telusuna Members

ఓటు బడ్డ కుండ, ఒట్టి కుండ

రమాకాంతరావు చాకలకొండ

ఓటు బడ్డ కుండ, ఒట్టి కుండ
వాడి వృద్ధాప్యపు ఒడలు కుండ. ||ఓటు||

1. దీటుగ ధగ ధగతో దీప్తు లొందిన కుండ,
మేటి ఘన కీర్తుల మట్టి కుండ, నా
నాటికి కృంగి నేలకు ఒరిగేటి,
నేటి - పనికి రాని - నీటి కుండ. ||ఓటు||

2. ఎటు పడ్డ విరిగెడి ఓటువోపు కుండ,
వట్టి దనము తోటి ఉట్టి కెక్కెడి కుండ,
ఆటోప, గర్వముతో అలమటించెడి కుండ
ఓటిల్లు ఒడపి యీ ఉత్త కుండ. ||ఓటు|

3. గట్టి నని గర్వించు గుట్టు కుండ,
గీట్లు బడి నేలకు కూలు కుండ,
మేటి వేంకట పతి మాయ చిక్కిన కుండ
పటువు లేనట్టి పగులు కుండ. ||ఓటు||

పంచభూతములతో నిర్మితమై, పంచభూతముల ఆధారముతో జీవిస్తూ, బలము పుంజుకొని, నేను నిత్యము అని భావిస్తూ, గర్వము తో అహంకరించి విచ్చల విడి చేయి యీ దేహమనే కుండ, రోగములతో, వృద్ధాప్యముతో ఒకనాడ నేలకొఱుగుట జీవత సత్యము.

రమాకాంతరావు చాకలకొండ February 8, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list