శ్రీవారి విరహంలో సిరి విరహ బాధ సైపలేర, వద్ద చేర్చుకొమ్ముర, శ్రీ కర! శ్రీ వేంకటేశ, సరసము లందించర. ||విరహ|| 1. గాజుల గల గలలు విన, గుండె ఝల్లు మనెనుర, జాజులు జడ లోన మురసి, సిగ్గుతోటి వంగెర, నాజూకుగ నా పెదవులు, నీ పేరు పల్కెర, సుజన! ఘనా ఘన! సరగు, సరసకు రావేమిర? ||విరహ|| 2. మోజుపడ్డ నా మనసు, మధనలోన మునిగెర, నెల రాజు నింగి నుండి, నేల వైపు జారెర, అజగవము వంటి మేను, అలసత చెందెర, తో యజదళ తేజ నయన! త్వరితము చేయర. ||విరహ|| 3. అజిరము నా మేను సోక, అలత లెన్నో కల్గెర, వజ్రతుండ వాహన! విజయము చేయర, విజయచ్ఛందము పట్టి, వాకిట వేచేనుర, వజ్రినుత! వేంకటేశ! వడి వడి, ఒడి చేర్చర. ||విరహ|| రమాకాంతరావు చాకలకొండ February 10, 2008 అజగవము = శివుని విల్లు, అజిరము = గాలి, వజ్రతుండుడు = గరుత్మంతుడు, సరగు =వేగము విజయచ్ఛందము = ఏనూఱ పేటల హారము వజ్రి = ఇంద్రుడు, విజయముచేయు = వచ్చు |
#maa telugu talliki mallepU daMDaa# |