Creative works from Telusuna Members

తనువు వేరు, లోని తను ధారి వేరు

రమాకాంతరావు చాకలకొండ

తనువు వేరు, లోని తను ధారి వేరు
తనువు వస్త్రమే, దాల్చు తేజశ్వి వేరు. ||తనువు||

1. అన్న పానము గోరు అల్ప దేహము వేరు,
అన్నిట కను గొన్న అంతరాత్మ వేరు,
కనపడు కాయము - కడకు కట్టెగ మారు,
కనపడని ప్రాణము, కమల నాభుని తీరు. ||తనువు||

2. వ్యర్ధమీ దేహము వంగి నేలకు జారు,
పార్దివ దేహమును పట్టు గేహి వేరు,
దురితముల తగులు యీ దేహము వేరు,
స్వార్ధ భావాతీత జీవాత్మ వేరు. ||తనువు||

3. ఐదు భూతముల యీఅల్ప దేహము వేరు,
తుదకు నశియించి వానినే చేరు,
ఆది అంతము లేని అందు తత్వము వేరు
ఆదిత్య తేజముతో అది అమరమై అలరు. ||తనువు||

4. గాయములు చెందెడి కాయము వేరు
వాయు, అగ్నీజలాతీత జీవము వేరు,
ఒయ్యని ఒరిగెడు కాయము వేరు, శేష
శాయిని చేరు సూక్ష్మ రూపము వేరు. ||తనువు||

రమాకాంతరావు చాకలకొండ February 15,2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list