Creative works from Telusuna Members

అలమేలు కౌగిలిలో అలరేటి స్వామికి, అందాల చందన నీరాజనం

రమాకాంతరావు చాకలకొండ

అలమేలు కౌగిలిలో అలరేటి స్వామికి, అందాల చందన నీరాజనం,
కలికి సిరి ఒడిలోన కులికేటి స్వామికి, కర్పూర హారతులు నీరాజనం. ||అల||

1. నిత్య కల్యాణములో నిండారు స్వామికి, నుతి, స్తోత్ర, గీతముల నీరాజనం,
సతతము శ్రీ సతి సొంపులు మరగిన, నల్లనయ్యకు నిత్య నీరాజనం. ||అల||

2. సిరి రమణి లావణ్య సరస సల్లాపముల, సుఖియించు స్వామికి నీరాజనం,
సరసిజాసని వాలు సన్నని చూపులలో, చిక్కిన వానికి నీరాజనం. ||అల||

3. కరి రాజ వరదునికి, కరుణాంతరంగునికి, కొమ్మలు పట్టెడి నీరాజనం.
వర వేంకటాపతికి, వనజ హృద్ వాసునికి, విశ్వజనులు పట్టు నీరాజనం. ||అల||

4. శ్రీకాంత సురతములో సొలసిన స్వామికి, చల్లని వీచికల నీరాజనం,
ఏకాంత సేవలో రమాకాంతుడు యిచ్చు, అతిరమ్య పదములు నీరాజనం. ||అల||

రమాకాంతరావు చాకలకొండ February 17, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list