Creative works from Telusuna Members

తనువు ఉన్న వరకే తమకములు, తాపములు

రమాకాంతరావు చాకలకొండ

తనువు ఉన్న వరకే తమకములు, తాపములు,
కను మూసినంతనే, కడతేరు శోకములు. ||తనువు||

1. నాన్న, అమ్మలు యను నున్నని బంధములు,
కన్న బిడ్డలు, ఆలి - కట్టుకొను మోకులు,
మిన్నగు మిత్రగణ, బంధువుల రాగములు,
వెన్నలా కరుగగ, విడిపోవు సంకెలలు. ||తనువు||

2. సన్నని బాధలు, సోయగపు వేటలు,
అన్నన్న! ఆశలు, అడియాస, వేదనలు,
ఖిన్న మనంబున, కడతేరు కోర్కెలు,
మన్నులో కలయగ ముగియు నీ చందములు. ||తనువు||

3. మన్నిక లేనట్టి మనుజుల మోహములు,
పన్నగము వంటి యీ పట్టిన దాహములు,
ఉన్నతుడు శ్రీహరి, ఉరగ శయనుని చేర,
పొన్నారిగా మార పరిసమాప్తములు. ||తనువు||


పొన్నారిగ = మనోఙ్ఞముగా

రమాకాంతరావు చాకలకొండ February 24,2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list