Creative works from Telusuna Members

తెల్లవారెను దేవర, తిరుమలేశ లేవర,

రమాకాంతరావు చాకలకొండ

తెల్లవారెను దేవర, తిరుమలేశ లేవర,
నల్ల మబ్బులు వీడెర, నలువ జనక చూడర. ||తెల్లవారెను||

1. కలువ కన్నుల కమలనాభా!
మెల్లగ కను లిప్పర,
తెల్ల దనము తూర్పు దిశన,
వెల్లువాయెను కాంచర. ||తెల్లవారెను||

2. నలువ, శంకర, నారదాదులు,
కొలువు కొచ్చిరి ఓ దొర,
పిలుపు విన్న పలుక వేమిర,
అలుక, యాటలు మానర. ||తెల్లవారెను||

3. కలువ వాసిని కొంగు వదలి
వెలికి వేగ రమ్ముర, తెల్ల
వలువతో పుడమి కాంత, వచ్చె
చెలువము జూడర. ||తెల్లవారెను||

4. సులువుగ భక్తులకు దొరకెడి
నల్లనయ్య! నా దొర,
వెల్లువైన దయలు జూపి,
చల్లగా మమ్మేలర! ||తెల్లవారెను||

రమాకాంతరావు చాకలకొండ January 1, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list