Creative works from Telusuna Members

కొమ్మలిద్దరి మధ్య కులికేటి ఓ స్వామి!

రమాకాంతరావు చాకలకొండ

పల్లవి. కొమ్మలిద్దరి మధ్య కులికేటి ఓ స్వామి!
అమ్మ లిద్దరి తోటి అగుపించ వేమి? ||కొమ్మ||

అనుపల్లవి. ఇమ్ముగ భామలతో ఇచ్చగించెడి స్వామి!
కమ్మగ ఒక పరి మాట్లాడ వేమి? ||కొమ్మ||

1. కమ్ముకొని మేఘములు కన్నులలో నిండగ,
తిమిరములు తొలగించి కాపాడ వేమి?
నమ్మకముగ నిన్ను కొల్చేటి భక్తులు,
రమ్మని పిలువగ అరుదెంచ వేమి? ||కొమ్మ||

2. సొమ్ములెన్నో వేసి సొగసు చూపెడి స్వామి,
సొమ్మేది పోదులే దరికి రావేమి?
రమ్ము రమ్మని పిలువ, బిగువు చూపెద వేమి,
నెమ్మిగ మాపైన దయ జూప వేమి? ||కొమ్మ||

3. కిమ్మనక మంగమ్మ కొంగు బట్టిన స్వామి,
అమ్మచెల్ల యింత నయగార మేమి?
ఇమ్ముగ సప్తగిరి నెంచి వెలసిన స్వామి,
ఇమ్ముకొని గుండెలో నెలవుండ వేమి? ||కొమ్మ||

4. బొమ్మలాటల యీ బ్రతుకు నాటకములో
మమ్ములను ఆడించి తిలకింతు వేమి?
కుమ్ములాటల యీ బ్రతుకు పోరాటములో,
సొమ్మసిల్లిన మాకు శరణీయ వేమి? ||కొమ్మ||

ఇమ్ము = స్థానము, ఇమ్ముకొను = వశించు
రమాకాంతరావు చాకలకొండ January 3, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list