Creative works from Telusuna Members

అందమంటే ఏదిర? ఆనంద మంటే ఏదిర?

రమాకాంతరావు చాకల కొండ

పల్లవి. అందమంటే ఏదిర? ఆనంద మంటే ఏదిర?
కందువగ అది ఎందునుందో, కన్ను విప్పి చూడర. ||అందమంటే||

అనుపల్లవి. ముందు నున్న ముదిత మోమున? పొందు లోనో దాగి ఉన్నాదా?
డెందమున వివరింప జేసి, పొందు కాంక్షను జేయర. ||అందమంటే||

1. చక్కదనపు మేని సొగసులు, చిక్కిపోయి శల్యమైన,
పొక్కి రోగపు పుట్టయైన, దిక్కు లేని దేహమందు,
ముక్కి మూల్గెడి మేని యందు, సొక్కి సోలెడి కాయమందు
నక్కి ఉన్నదా చూచు అందము, చిక్కు మానవ! విప్పర.||అందమంటే||

2. లెక్కలేని నోట్ల కట్టలు, డొక్కుమూటలో దాచు నగలు,
అక్కరకు యిక అందిరాక, చిక్కులోన ముంచు వేళ,
టక్కు మారి లోకమందు, టెక్కు టాకుల సంపదందు
ఎక్కడున్నది సౌఖ్యము, నొక్కి చెప్ప వేమిర! ||అందమంటే||

3. ప్రక్క నున్న దాని మరచి, ఎక్క డెక్కడో వెతకి చూచి,
సొక్కు ఆశల సాగరములో, వెక్కి ఏడ్చెడి సోదర,
మక్కువగ శ్రీ వేంకటాదిపై, మ్రొక్కినంతనే మోక్షమీయ,
వెక్కసంబుగ వెలసి ఉన్నది, దిక్కు నీకదే కాంచర. ||అందమంటే||

రమాకాంతరావు చాకల కొండ January 6, 2008


#maa telugu talliki mallepU daMDaa#

Back to list