Creative works from Telusuna Members

మనుషుల జీవితాలు

మోహన్ వల్లభజోశ్యుల
మనుషుల జీవితాలు
మోహన్ వల్లభజోశ్యుల
---
తారాపథంలో తాండవించే తరుణాల్లో
తారలకి, సినిమాల్లో పడే కష్టాల్లా
ప్రయాణ ప్రమేయంలేని నావికునికి తుఫానులా
క్రెడిట్ కార్డ్ దుర్వినియోగపు విషాదాలు
నిరుద్యోగ సంభవంతో సంతరించు నిస్పహలు
బుఱ్ఱకి తట్టవు, తట్టినా అలజడులు లేపవు

భూతలంపై కాలు నిలపవలసి వచ్చేసరికి
మితమనేదే లేనట్లు యెదురౌను సమస్యలు
శీతాకాలంలో ఉత్తర ధృవనివాసంలా
మాతృదేశాన్ని మరువలేని మైగ్రెంట్ జేవితంలా
నిత్యభోగలాలసునికి వృధ్ధాప్యంలా
మతి పోగొట్టి మదిలో కలవరం లేపుతాయి

అనిత్య స్వరూపమే జీవితమని తెలిసినా
అంబుధి కైనా ఆటుపోట్లు అవసరమని
మునీశ్వరులకైనా మానాభిమానాల సొద తప్పదని
అన్నీ తెలిసినా అనుభవాలు చెప్తున్నా
మనిషికి తోడ్పడు భావాలెన్నో అందుబాటులోనున్నా
అనునిత్యం అలవికాని అనుభవాలకై ఆరాటం మానము
అనాలోచితంగ, ఆకాశవిహారాలు వీడముజీవించడాన్కి లక్ష్యం, అర్థం, పద్ధతి ముఖ్యం
అనుకుంటాడు మనిషి
జీవులలో కేవలం మానవుడే యేర్పరచుకోగలడు,
కల్పించుకుంటాడు వీటిని
ఇవన్నీ యున్నంత మాత్రాన విశ్వవిశాల మైన జీవితం కన్న
భిన్నం కాదు మన జీవితం

రవీంద్రుడు చెప్పినట్లు, జీవితమనేది కేవలం
మనిషి కల్పన కాక పోయినా,
అవిశేష, అనంత, అగమ్య, అప్రేరణాయుక్తమౌ
సువిశాల జగత్తు, చేయునట్లు మనకు దోచు, గమనమే.

ఆకాశాన అవతరించేనను కొన్న నీటి బొట్టు
సంకల్పమేమీ లేకున్నా సంద్రమును చేరునట్లు,
మారుమూలలం మలయమారుతము వలె దోఁచు
చిఱుఁగాలి గమనమున శక్తివంతమౌ ఫెనుగాలౌనట్లు,
సంకల్పములేక కర్మను పాటించువారందరూ
లోకపోకడలం బోలేక పొగడ్తలంద లేరు-
గాక, సూక్ష్మముగ కర్మవిముక్తి నొంద గలరు,
లోకాతీతులయి జీవన్ముక్తులగుదురు# #

Back to list